Pages

Search This Blog


Thursday, August 4, 2011

సంగీతదర్శకుడు ' పెండ్యాల నాగేశ్వరరావు

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమాసంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూపాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించినకొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పని చేశారు. స్వతంత్ర్య సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపొకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతోసాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు. సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్నీ, హిందుస్తానీ పోకడల్నీ తీసుకుని మన రాగాలతో మిళితం చేసి, ‘తెలుగుపాట’లా చేసి వినిపించగల సమర్థుడనిపెండ్యాల పేర్కొనేవారు. పెండ్యాల గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు , ముద్దుబిడ్డ , భాగ్యరేఖ , జయభేరి , మహామంత్రి తిమ్మరుసు , శ్రీకృష్ణార్జున యుద్ధం , రాముడు భీముడు , శ్రీ కృష్ణ తులాభారం కొన్ని చాలు - వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి.

అద్భుతమైన పాటలే కాదు, పద్యాలు కూర్చారు. పౌరాణిక చిత్రాలకు సాంఘిక, జానపద చిత్రాలకూ అద్భుతమైన బాణీలు సమకూర్చడానికి తాను ఎంత రిహార్సిల్స్‌ చేసేవారో, గాయనీ గాయకులతో కూడా రిహార్సిల్స్‌ చేయించి మరీ పాడించేవారు. రంగస్థల నటుడు, హార్మోనిస్ట్‌ కూడా కావడంతో పద్యాల మీద రంగస్థలంలో తనకు గల పట్టు, చిత్రాల్లో కూడా పద్యాల మీద చూపి సినిమాల్లో కూడా ఓహో అనేలా పద్యాలు పాడించేవారు. గాయనీ గాయకుల టేలెంట్‌ గుర్తించి, వారి టేలెంట్‌ని సద్వినియోగం అయ్యేలా చేయడానికి మీదు మిక్కిలి శ్రమించేవారు పెండ్యాల.

శాస్త్రీయ సంగీతంలోనూ, హార్మోనియం వాయించడంలోను పేరు ప్రఖ్యాతులు పొందిన తండ్రి సీతారామాయ్య నుంచి గాత్రం, హార్మోనియం రెండూ నేర్చుకున్నారు మిగతా విద్యార్థులతో పాటు. అలాగే తండ్రి రంగస్థల ప్రదర్శనలకు హాజరు అవుతుంటే పెండ్యాల దృష్టి అటువేపు మళ్ళింది. అందుకే స్కూల్లో పాటలు పద్యాలు పాడటమే కాకుండా అప్పుడప్పుడు వేషాలూ వేస్తూ మెల్లిగా రంగస్థలం మీదకు నటుడుగా ప్రవేశించి హార్మోనియం కూడా మీటేవారు.

ఆరుద్ర పెండ్యాల, తిలక్‌ కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లో ఎంత చక్కని పాటలు రూపొందాయో, ఘంటసాల, సుశీల, పెండ్యాల కాంబినేషన్లోనూ అద్భుతమైన పాటలు వెలువడ్డాయి.

దొంగరాముడు, ముద్దుబిడ్డ, ఎమ్‌ఎల్‌ఎ, భాగ్యరేఖ, జయభేరి, భట్టి విక్రమార్క, ఈడూజోడూ, అత్తా ఒకింటి కోడలే, హరిశ్చంద్ర, మహాకవి కాళిదాసు, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, జగదేక వీరుని కథ, వాగ్దానం, మహామంత్రి తిమ్మరుసు, కులగోత్రాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, రాముడు భీముడు, వెలుగునీడలు, ఉయ్యాల జంపాల, శ్రీకృష్ణ సత్య, బావామరదళ్లు, అక్కాచెల్లెలు ఇలా అనేక చిత్రాలను అద్భుతమైన సంగీతం సమకూర్చారు పెండ్యాల.

పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం (1945) చిత్రానికి హార్మోనిస్టుగా పిలిస్తే, దుక్కిపాటి మధుసూదనరావుగారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమారంగానికి వచ్చారు. గృహప్రవేశం (1946) చిత్రనిర్మాణానికి సారథ్యం వహించిన కె.ఎస్‌.ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీతదర్శకుడి స్థానం ఇచ్చారు. ఆచిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా వుంటారుగనక, సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు. అంతే! పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికిపూర్తిగా అర్థమైంది. తరువాత తాను నిర్మించిన, ద్రోహి(1948)కి పెండ్యాలకు సంగీతదర్శకుడుగా అవకాశం ఇచ్చారుప్రకాశరావుగారు. ఆ చిత్రానికీ, ఆ చిత్రంలోని కాఫీ ఖవాలీ, మనోవాంఛలు, పూవు చేరి, చిక్కిలిగింతలు మొదలైనపాటలకీ మంచి పేరొచ్చింది. పెండ్యాల సంగీత
గాదర్శకుపెండ్యాల నాగేశ్వరరావుడు స్థిరపడ్డారు. సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా ట్యూన్‌ వచ్చేవరకూ, ఒళ్లు వంచి పనిచెయ్యడం, తను అనుకున్నట్టే గాయనీగాయకుల చేతపాడించడం - పెండ్యాల గుణం. గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ వుందో, అంత ప్రతిభనీ పూర్తిగావినియోగించుకునే సంగీతదర్శకుడాయన. ఘంటసాలకీ, పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం. పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడులేడు!. పెండ్యాల గారి వేలపాటల్లో - అది క్లబ్బుపాటైనాఅందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే, హిందీపాటని అనుసరించినా, పాశ్చాత్యధోరణిని అనుకరించినా అందులోతెలుగుదనం వుట్టిపడుతుంది. సంగీతరస హృదయులకీ, గాయనీగాయకులకీ అందరికీ నచ్చే సంగీతం ఆయనది.

మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని గుక్క తిప్పుకోవడానికీ, సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనానిలబెట్టడానికీ వీలుకల్పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకొన్నది రాబట్టేవరకూ విడిచి పెట్లేదు.

జగదేకవీరుని కథలోని శివశంకరీ పాట గురించి ఘంటసాల చెప్పేవారు. ‘పాట మొత్తం ఒకే టేక్లో పాడగలిగితేబావుంటుంది - ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే’ అని పెండ్యాలగారంటే - ‘ఒకే టేక్లో మొత్తం పాడతానుచూడండి’ అని ఘంటసాల ‘పందెం’ వేసినట్టు అన్నారు. ‘వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్కి వెళ్లకుండా ఆపాటనే సాధన చేసి, అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన’ అని పెండ్యాలగారు, ఘంటసాల మృతిసందర్భంగా చెబుతూ, ఆయన్ని స్తుతించారు.‌ ‌ ‌

No comments:

Post a Comment